ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేజ్రీవాల్ కు కోర్టు విధించిన ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో, ఆయనను సోమవారం కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్తుండటం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే గత నెల 22న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన పై తాజాగా ఆయన భార్య సునీత కేజ్రీవాల్ స్పందించారు. తన భర్త నిజమైన దేశభక్తుడని, కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని సునీత కేజ్రీవాల్ అన్నారు. ఆమె శుక్రవారం కేజ్రీవాల్‌ను ఆశీర్వదించండంటూ వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. తన భర్త కేజ్రీవాల్ నియంత శక్తులను సవాల్ చేస్తున్నారని, ఈ టైంలో ఆయనకు మనందరి మద్దతు కావాలని కోరారు. కేజ్రీవాల్‌ను ఆశీర్వదిస్తున్నామని అందరూ సందేశాన్ని పంపించాలని కోరుతూ వాట్సాప్ నెంబర్‌ను షేర్ చేశారు. కేజ్రీవాల్ కు ప్రజల మద్దతు ఇవ్వాలని కోరిన మూడు రోజుల్లోనే కేజ్రీవాల్ తీహార్ జెలుకు వెళ్ళటం ఆయన భార్య సునీత కేజ్రీవాల్ జీర్ణించుకోలేకపోతున్నారు.