రాజకీయాలలో ఒక పార్టీ నుండి ఒక పార్టీ కి మారడం నేడు సర్వసాధారణమైపోయింది. ఉన్న పార్టీలో విలువ తగ్గటమో..లేదా అవతలి పార్టీ వారు ప్రధాన్యత ఇవ్వటమో ఇందుకు ముఖ్య కారణం.. అసలు విషయానికి వస్తే ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. బుద్ధప్రసాద్‌కు ఇప్పటికే అవనిగడ్డ టికెట్ ఖాయమైనట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినిస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ స్థానం జనసేనకు కేటాయించారు. ఈ క్రమంలో ఆ స్థానం నుండి బుద్ధ ప్రసాద్‌ను బరిలోకి దింపే ఆలోచనలో జనసేన అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం . 1999, 2004, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడం కూడా ఇందుకు మరో కారణం. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా అవనిగడ్డను తన ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తోంది. ఇక, మచిలీపట్టణం లోక్‌సభ స్థానానికి కూటమి నుంచి బరిలోకి దిగిన వల్లభనేని బాలశౌరికి జనసేన టికెట్ కేటాయించడం వెనక మండలి బుద్ధప్రసాద్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.