బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎల్బీ స్టేడియంతో తనకు అనుబంధం ఉందని, పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజలు ఆశీర్వదించడంతో తాను ప్రధానిని అయ్యానని వ్యాఖ్యానించారు. ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారు. నాటి నా సభలో ప్రసంగం కోసం టిక్కెట్ పెట్టారని, దేశంలోనే ఇదో కొత్త ప్రయోగం అన్నారు. 

తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ అది నెరవేరలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇలాంటి వారిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారన్నారు. అదే సమయంలో అబ్దుల్ కలాంను, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిని చేసింది తామే అన్నారు. లోక్ సభలో తొలి దళిత స్పీకర్ బాలయోగిని చేసింది కూడా బీజేపీయే అన్నారు.