బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో జనసేనాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు  అందరికీ అందాయా? అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. సకల జనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. జల్… జంగల్… జమీన్ అంటూ కొమురం బీమ్ పోరాడారన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం లేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసి ఉండేవారు కాదని, మహిళా బిల్లు తెచ్చేవారు కాదన్నారు. ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే వారు కాదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు. అంతర్జాతీయస్థాయిలో భారత్‌ను ప్రధాని అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి అని అన్నారు. అలాంటి ప్రధానికి తాము అండగా ఉంటామన్నారు. దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు. ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ నినదించారు.