జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రలో భాగంగా నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, నిన్న ఈ ముఖ్యమంత్రి కురుక్షేత్రం ప్రారంభమైందని అన్నాడని, కానీ కౌరవులు వాళ్లేనని, ఓడిపోయేది కూడా వాళ్లేనని పవన్ పేర్కొన్నారు. 100 మంది పైగా ఉన్న వైసీపీ వాళ్లే కౌరవులని, కాబట్టి వాళ్లు ఓడిపోవడం, తాము అధికారంలోకి రావడం ఖాయం డబుల్ ఖాయం అని వ్యాఖ్యానించారు. 

అవనిగడ్డ అంటే డీఎస్సీ శిక్షణకు ఆయువుపట్టు వంటిదని, ఏపీలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అభ్యర్థులు వేలకు వేలు ఖర్చుపెట్టి సన్నద్ధమైనా, ఇంతవరకు డీఎస్సీ జాడేలేదని మండిపడ్డారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోలేదని, ఎవరికీ న్యాయం చేయలేదని ఆరోపించారు. “ఇది పింగళి వెంకయ్య గారికి జన్మనిచ్చిన నేల… దేశానికి జాతీయ పతాకాన్ని ఇచ్చిన నేల. 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను… అనుభవం సంపాదించాను… మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని నిలబడ్డాను. నేను 2014లో బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చాను. కానీ, కొన్ని హామీల విషయంలో, ప్రత్యేక హోదా అంశంలో వారితో విభేదించి బయటికి వచ్చాను. హామీల పైనా, ప్రజాసమస్యల పైనా నేను అంత నిబద్ధతో ఉంటాను. ఇవాళ ప్రత్యేక పరిస్థితుల వల్ల వారికి మద్దతుగా నిలుస్తున్నాం.