‘గబ్బర్ సింగ్’తో ఇండస్ట్రీ హిట్‌ సాధించిన పదకొండేళ్ల విరామం తర్వాత పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. హైదరాబాద్‌లో నిన్నటితో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వేసిన ప్రత్యేక సెట్‌లో యాక్షన్ సీక్వెల్స్‌ను తెరకెక్కించారు. ఇది ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ అని తెలుస్తోంది. మరిన్ని వివరాలను వెల్లడిస్తామని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. దర్శకుడు హరీష్ శంకర్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పవర్ స్టార్ లుక్స్‌తో పాటు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. పవన్ సరసన  శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాశ్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.