ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు, సీఎం కేసీఆర్ ఆయన పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి  పనులకు ప్రారంభోత్సవం చేయగా, ఆ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. దీనిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు.  దేశంలో ఎక్కడైనా ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? ప్రధాని వస్తే, ఆయన కార్యక్రమాలకు హాజరయ్యేంత తీరిక ఈ సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. ఎంతసేపూ ఓటు బ్యాంకు రాజకీయాలేనా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని వస్తే, సీఎం హాజరు కాకపోవడం అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ సభలో ప్రసంగిస్తూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.