టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ఇప్పటిదాకా ప్రజల్లోకి వెళ్లింది లేదు. కానీ, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యాక ఆమె బయటికి రావాల్సి వస్తోంది. ఈ క్రమంలో, ఆమె ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.  ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో యాత్ర చేపడతారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని వివరించారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభిస్తారని లోకేశ్ వెల్లడించారు. యాత్ర ప్రారంభానికి ముందు భువనేశ్వరి ఈ నెల 24న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. తిరుమల నుంచి అదే రోజున బయల్దేరి నారావారిపల్లెకు వెళతారని లోకేశ్ చెప్పారు.