బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై ఈసీ రెండు రోజుల పాటు నిషేధం విధించింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది. సిరిసిల్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ ఐదో తేదీన సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసింది. కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.కాంగ్రెస్ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఈసీ.. కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. కాగా కేసీఆర్ వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందక కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారం మీద ఎన్నికల సంఘం విధించిన ఈ నిషేధం.. మే ఒకటో తేదీ రాత్రి 8 గంటల నుంచి మే మూడో తేదీ రాత్రి 8 గంటల వరకూ అమల్లో ఉండనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనావళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యాఖ్యలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. మరోవైపు ప్రస్తుతం బస్సుయాత్ర నిర్వహిస్తున్న కేసీఆర్.. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. సూటి విమర్శలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం రెండు రోజుల నిషేధంతో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరం కావాల్సి వస్తోంది . తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న సమయంలో ఈసీ తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్‌కు ఇబ్బందికరమేనని చెప్పొచ్చు