రక్తంలో మునిగితేలుతున్న వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకూడదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమమహేశ్వరరావు పేర్కొన్నారు. వివేకా కుమార్తె డాక్టర్  సునీత ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ ఆమె మాట్లాడిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో సునీత మాట్లాడుతూ.. బాబాయిని హత్య చేసిన వారికి టికెట్లు ఇచ్చి ఓటు వేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన హత్యను వాడుకొని రాజకీయ లబ్ది పొందారని పేర్కొన్నారు. వివేకా హత్యపై సాక్షి చానల్‌లోనైనా చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. అప్పుడే అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తామని చెప్పారు. 

అన్నగా కాకపోయినా ముఖ్యమంత్రిగానైనా తమకు సమాధానం చెప్పాలని జగన్‌ను డిమాండ్ చేశారు. అవినాశ్‌రెడ్డిని, వీలైతే జగన్‌ను ఓడించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రాకూడదని పేర్కొన్నారు. తన తండ్రి కేసులో నిందితుడైన వ్యక్తి కేసు విచారణకు రాకుండా అడ్డుకుని తనపై అనర్హత వేటు పడకుండా చూసుకుంటూ మళ్లీమళ్లీ గెలవాలని చూసుకుంటున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.