కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ హాజరయ్యారు. సీఈసీతో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు, పవన్ మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ, ఇవాళ  ఎన్నికల సంఘాన్ని కలిసి అన్ని విషయాలను వారికి స్పష్టంగా వివరించామని వెల్లడించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని అన్నారు. జనసేనాని పవన్ కూడా రాజకీయ పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఎక్కడా పనిచేసుకోనివ్వని పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల్లో తిరుగుబాటు రావడంతో, హోల్ సేల్ గా ఓటర్లందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకుంటే తప్ప గెలవలేం అనే తుది నిర్ణయానికి వచ్చారని చంద్రబాబు వివరించారు. దీనికి సంబంధించి సీఈసీకి ఇవాళ ఒక ఉదాహరణ ఇచ్చామని, ఒక్క చంద్రగిరిలోనే ఫారం-6 కింద 1 లక్ష 15 వేల ఓట్లు ఇచ్చారని తెలిపారు. వాటిలో దాదాపు 33 వేల ఓట్లను ఆమోదించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను సీఈసీకి ఇచ్చామని చంద్రబాబు తెలిపారు.