ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సాయంత్రం ఏఐసీసీ పెద్దలతో ఆయన భేటీకానున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. 

ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 10కి పైగా స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, లోక్ సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో సత్తా చాటాలని రేవంత్ కృతనిశ్చయంతో ఉన్నారు.