రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనను ఉంచిన సెల్ లో దోమల బెడద ఎక్కువగా ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే జైలులోని ఓ రిమాండ్ ఖైదీ డెంగ్యూతో చనిపోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దీనిపై ఏపీ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. టీడీపీ శ్రేణులు ఆరోపణలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతుండగా వైసీపీ వర్గాలు ప్రత్యారోపణలతో కౌంటర్ ఇస్తున్నారు. ఈ దోమల గొడవ చిలికి చిలికి గాలివానగా మారే సూచనలు కనిపించడంతో జైలు అధికారులు చర్యలు చేపట్టారు.సెంట్రల్‌ జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో వృక్షాలు, మొక్కలు ఉండడంతో దోమల బాధ ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో దోమల బెడదను నివారించేందుకు ఫాగింగ్ చేయించారు. జైలు ప్రాంగణంతోపాటు పరిసరాల్లోని చెట్లు పుట్టలు, పొదల్లో కూడా మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్‌ కార్యక్రమం చేపట్టారు. ఖైదీల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు వివరించారు.