నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత నియోజకవర్గమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరలోని పెదఅమిరంలోని తన నివాసంలో స్థానికుల్ని కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయగలననే విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. ప్రజాపక్షనా న్యాయం కోసం జగన్‌మోహన్‌రెడ్డికి ఎదురెళ్తే తనని జైల్లో పెట్టారని గుర్తు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు తనకు చాలా సాయం చేశారన్నారు. అంత సహాయ పడిన వ్యక్తి తనకు ఎందుకు అన్యాయం చేస్తారని , తనను చంపకుండా, తన పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్యాయం చేస్తారనే ఆలోచన తనకు లేదన్నారు. తనకు సీటు వచ్చే విషయంపై తన కన్నా ఎక్కువగా తన నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని ద్వేషించే అందరికీ నమ్మకం ఉందని రఘురామా విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధిష్ఠానంతో తనకు పరిచయంగాని, సాన్నిహిత్యం గాని లేదని , దాంతోనే అంతరం వచ్చి ఉండొచ్చన్నారు. తనకు మద్దతుగా కొన్ని వేల మంది నుంచి ఫోన్లు వచ్చాయని.. కూటమి నూటికి నూరుశాతం తనకు న్యాయం చేస్తుందని రఘురామ తెలిపారు ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారన్నారు . వాటిని త్వరగా విచారించాలని ఒకటి, ఇన్నాళ్లూ న్యాయస్థానానికి వెళ్లకపోవడంతో బెయిల్‌ రద్దు చేయాలని మరొక పిటిషన్‌ వేశానన్నారు. ఆ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఏప్రిల్‌ 1న విచారణకు రాబోతున్నాయని.. హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రజాకోర్టుల్లో ఆ ఉన్మాదిపై ఒంటరి పోరాటం చేస్తున్నానని రఘురామ తెలిపారు .ముందుచూపుతోనే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో తాను చెప్పలేదని ,బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చన్నారు . రఘురామ నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేద్దామని భావించారు..అయితే ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో.. ఆ పార్టీ టికెట్ ఇష్తుందని భావించారు. కానీ అనూహ్యంగా రఘురామను కాదని.. శ్రీనివాసవర్మకు టికెట్ ఇచ్చారు.