అందరూ ఊహించినట్టుగానే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శుక్రవారం పాలకొల్లులో టీడీపీలో చేరారు . ప్రజాగళం సభా వేదికపై చంద్రబాబు రఘురామకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన అనంతరం రఘురామ ప్రసంగించారు. “మూడు పార్టీల అభిమానులకు అయన కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబే అన్నారు . ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా, న్యాయవాదులతో మాట్లాడడమే కాకుండా, నా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారని గుర్తు చేశారు . ఉన్నాను, విన్నానని కొందరు సొల్లు కబుర్లు చెబుతారని , చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదని రఘురామ అన్నారు . నిజంగా ఆయన తనకు ఉన్నారని , నిజంగా ఆయన తన ఆక్రోశం విన్నారని , తన బాధ విన్నారు కాబట్టే… ఆయన ఇవాళ చెప్పినట్టు తాను మీ ముందు బతికున్నానని రఘురామా భావోద్వేగానికి గురయ్యారు. . అందుకే చంద్రబాబుకు తానెంతో రుణపడి ఉన్నానని , కొన్ని కారణాల వల్ల తను నాలుగేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని , ఇవాళ చంద్రబాబు చొరవతో మళ్లీ మీ ముందుకు వచ్చానని రఘురామా కృష్ణం రాజు తెలిపారు . ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. అతి త్వరలోనే జూన్ 4న చంద్రబాబు, పవన్ , నరేంద్రమోదీ ప్రభంజనం సృష్టించబోతున్నారన్నారు. . ఈ త్రిమూర్తుల కలయిక ఉంటుందని తాను సంవత్సరంగా చెబుతూనే ఉన్నానని , ఇందులో మోదీ బ్రహ్మ అయితే, విష్ణుమూర్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరమశివుడు, మనమందరం సైనికులమంటూ రఘురామ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు.