ఏపీలో ఎన్నికలకు ముందు అధికార వైఎస్సార్‌సీపీకి గట్టి దెబ్బ తగిలింది. మరో ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవితో పాటు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు పంపించి , వెంటనే ఆమోదించాలని లేఖలో మండలి ఛైర్మన్‌ను కోరారు. అయితే వైసీపీలో తనకు తగినంత ప్రాధాన్యం దక్కలేదనే భావనతోనే మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై.. రాజీనామా చేసిన బాలకృష్ణ ప్రత్యర్థి.. అదే కారణమా.. 2019 ఎన్నికల్లో మహ్మద్ ఇక్బా్ల్.. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో అప్పటి ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణకు గట్టిపోటీ ఇచ్చారు మహ్మద్ ఇక్బాల్. సుమారు 75 వేల ఓట్లు సాధించారు. బాలయ్యకు గట్టిపోటీ ఇవ్వటంతో వైసీపీ అధిష్టానం సైతం మహ్మద్ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవికి ఇచ్చి గౌరవించింది . అలాగే హిందూపురం వైసీపీ ఇంఛార్జిగా నియమించింది. అయితే వర్గపోరు కారణంగా ఇంఛార్జి పదవిని ఇక్బాల్ కోల్పోయారు. ఆయన స్థానంలో దీపిక అనే బీసీ సామాజికవర్గ నేతను వైసీపీ అధిష్టానం హిందూపురం వైసీపీ ఇంఛార్జిగా నియమించింది. అయితే ఇటీవల అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ జగన్.. దీపికకే టికెట్ ఖరారు చేశారు. దానితో మహ్మద్ ఇక్బాల్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం . మహ్మద్ ఇక్బాల్ కు కెట్ ఇవ్వకపోవటంతో పాటు పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవటంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలోనే గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న మహ్మద్ ఇక్బాల్.. శుక్రవారం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.