టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు చేరింది. రామ్ చరణ్ కు తాజాగా పాప్ గోల్డెన్ అవార్డు ప్రకటించారు. గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ కేటగిరీలో రామ్ చరణ్ కు ఈ అవార్డు లభించింది. 

ఈ పురస్కారం కోసం షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణే, అర్జున్ మాథుర్, ఆదా శర్మ, రాశి ఖన్నా, విశేష్ భన్సాల్, రిద్ధి డోగ్రా కూడా నామినేట్ అయ్యారు. వీరందరినీ వెనక్కి నెట్టి రామ్ చరణ్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు పాప్ గోల్డెన్ అవార్డ్స్ కమిటీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్ ఒక్కసారిగా ఇంటర్నేషనల్ ఫేమ్ అందుకున్నారు. ఆస్కార్ వేదికపైనా రామ్ చరణ్ నామస్మరణ జరిగింది. అదే  ఊపులో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ అవార్డును కూడా అందుకున్నాడు. తాజాగా పాప్ గోల్డెన్ అవార్డుకు ఎంపిక కావడంతో రామ్ చరణ్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.  

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రామ్ చరణ్ మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా, పాప్ గోల్డెన్ అవార్డ్స్ ఇతర కేటగిరీల్లో అంతర్జాతీయ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్, కొరియా మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్ కూడా విజేతలుగా నిలిచారు.