ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ లలో ఒకటి. దేశంలోని అన్ని కన్వెన్షన్ సెంటర్ లకంటే చాలా పెద్దది. ఢిల్లీలో రూ.5,400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన తొలి దశ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసీసీ)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. దీనికే యశోభూమి అని నామకరణం చేశారు. అంతకుముందు యశోభూమి వరకు చేరుకునేందుకు వీలుగా ఉద్దేశించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో రైలు ఎక్స్ టెన్షన్ ను ప్రారంభించిన ప్రధాని, అదే మెట్రోలో ద్వారక స్టేషన్ కు చేరుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కన్వెన్షన్ సెంటర్ ను 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రధాన ఆడిటోరియం సహా 15 కన్వెన్షన్ రూమ్ లు ఇక్కడ ఉన్నాయి. ఒక గ్రాండ్ బాల్ రూమ్, 13 సమావేశ మందిరాలు కూడా ఉన్నాయి. దీనికంటే ముందు రోజు యశోభూమిని ప్రధాని మెచ్చుకున్నారు. వ్యర్థ జలాల శుద్ధికి సంబంధించి గొప్ప ఆధునిక విధానం ఉందని, వర్షపు నీరు పొదుపునకు చర్యలు తీసుకున్న ఈ కాంప్లెక్స్ కు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినమ్ సర్టిఫికేషన్ వచ్చినట్టు చెప్పారు. అంతకుముందు విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతివృత్తి పని వారి ఆరాధ్య దైవం విశ్వకర్మ మహర్షికి ప్రధాని నివాళి అర్పించారు. పాదరక్షల కార్మికులతో ముచ్చటించారు. 

Previous articleసుప్రీంకోర్టులో కవితకు స్వల్ప ఊరట
Next articleఅధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తాం…రేవంత్ రెడ్డి