స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సైతం పార్టీలకు  అతీతంగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పంచుకున్నారు.

ఓ చిన్నారి బ్రాహ్మణి వద్దకు వచ్చి చంద్రబాబుకు మద్దతు పలకడాన్ని ఆ వీడియో చూడొచ్చు. గతంలో టీడీపీ హయాంలో చంద్రన్న పెళ్లికానుక పథకం తీసుకువరావడం తెలిసిందే. ఆ పథకం ద్వారా లబ్ది పొంది పెళ్లి చేసుకున్న ఓ దంపతులకు కుమారుడే సదరు చిన్నారి. అజిత్ కుమార్ అనే ఆ బాలుడు తనను కలవడం పట్ల బ్రాహ్మణి స్పందించారు. “చంద్రబాబు, లోకేశ్ లకు మద్దతు పలికేందుకు ఆ పిల్లవాడు చాలా దూరం నుంచి వచ్చాడు. ఆ చిన్నారి అభిమానం నాకెంతగానో నచ్చింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు చంద్రన్న పెళ్లికానుక పథకం ద్వారా ఒక్కటయ్యారు” అని బ్రాహ్మణి వివరించారు. కాగా, చంద్రబాబు విడుదలయ్యే వరకు తాను కూడా పోరాడతానని ఆ బాలుడు చెప్పడం నారా బ్రాహ్మణిని ఆకట్టుకుంది.