ఏలూరు జిల్లా భువనపల్లి వద్ద నారా లోకేశ్ యువగళం పాదయాత్ర క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యువగళం కార్యకర్త ఒకరు వైసీపీ నేతలపై దాడి చేశాడని, అతడిని తమకు అప్పగించాలని పోలీసులు స్పష్టం చేశారు. టీడీపీ నేతలు అందుకు ససేమిరా అన్నారు. దాంతో టీడీపీ నేతలతో పోలీసులు వాగ్యుద్ధానికి దిగారు.  లోకేశ్ బస చేసిన శిబిరంలోకి అనుమతి లేకుండా ఎలా వస్తారంటూ పోలీసులను యువగళం టీమ్ ప్రశ్నించింది. అయితే, తమ రక్షణ లేకుండా పాదయాత్ర ఎలా చేస్తారని పోలీసులు యువగళం టీమ్ కు బదులిచ్చారు. ఈ గొడవ జరుగుతుండగా, యువగళం శిబిరం నుంచి బయటికి వచ్చేయాలని పోలీసులను ఎస్ఐ ఆదేశించారు. అనంతరం లోకేశ్ క్యాంప్ నుంచి పోలీసులు వెనక్కి వచ్చేయడం ఉద్రిక్తత చల్లారింది.