ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిన నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తమ అధికారాన్ని పొడిగించుకునేందుకే వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని తెరపైకి తెచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.  దేశంలో  ముందస్తు ఎన్నికలు రావడం, లేదా ఆలస్యం కావడం జరగని పని అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పదవీకాలం చివరి రోజు వరకు సేవలు అందిస్తారని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు చేపట్టేందుకు వీలుగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేయాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఇవన్నీ మీడియా ఊహాగానాలేనని స్పష్టం చేశారు.