టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జంగా కృష్ణమూర్తి వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు అని, యాదవ కులానికి చెందిన వ్యక్తి అని వెల్లడించారు. ఇంకా రెండేళ్లు ఎమ్మెల్సీగా పదవీకాలం ఉన్నప్పటికీ, రాష్ట్రం నాశనం అవుతుంటే చూసి తట్టుకోలేక పదవిని కూడా వదులుకుని బయటికి వచ్చేశాడని వివరించారు. పదవులు, బంధుత్వాలు, డబ్బు ముఖ్యం కాదని, రాష్ట్రం తగలబడుతుంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఇక, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గురించి ప్రస్తావిస్తూ, అమరావతిని నాశనం చేస్తుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చేశాడని వివరించారు. అతడు టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా… అతడిపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.