ఏపీ ఎన్నికల ప్రచార పర్వానికి సమయం దగ్గర పడింది. ఆయా పార్టీలు మే 11 సాయంత్రం ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. 13వతేదీ ఉదయం ఎన్నికలు జరుగుతాయి. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ తరుపున చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారని అంతా భావించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా చిరంజీవి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ పోలింగ్ కి రోజులు దగ్గరపడినా చిరంజీవి ఇంకా ప్రచారానికి రాలేదు, అయితే ఈ దశలో తాజాగా చిరంజీవి తన తమ్ముడికి ఓటేయ్యండంటూ ఓ వీడియో విడుదల చేశారు .తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని వివరిస్తూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. అమ్మ కడుపులో ఆఖరివాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలి.. మేలు జరగాలి అనే విషయంలో ముందువాడిగా పవన్ కళ్యాణ్ ఉంటాడని చిరంజీవి తెలిపారు. జనం గురించి ఎక్కువుగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడిదని , ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటారని.. కానీ సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టిన గొప్ప మనసు కళ్యాణ్ ది అని కొనియాడారు. సరిహద్దుల దగ్గర ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తంలో సాయం చేయడంతో పాటు.. ఎందరికో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుందని చిరంజీవి వీడియోలో తెలిపారు. నిజం చెప్పాంలటే తన తమ్ముడు సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడని, కానీ రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాడన్నారు. ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చిరంజీవి వీడియో విడుదల చేయడంతో పిఠాపురంలో పవన్ గెలుపు మరింత సులభం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అన్నయ్య చిరంజీవి మద్దతు ప్రకటిస్తూ వీడియొ విడుదల చేయటంతో జనసైనికులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.