దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వారసుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న వంగవీటి రాధాకృష్ణ నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె జక్కం పుష్ప వల్లిని వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహానికి విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్ వేదిక కానుందని సమాచారం. రాత్రి 7.59 నిమిషాలకు పుష్పవల్లి మెడలో వంగవీటి రాధాకృష్ణ మూడుముళ్లు వేయనున్నారు. వంగవీటి రాధ, పుష్పవల్లిలకు గత నెల 3న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వివాహ ముహూర్తం ఖరారైంది.. ఈ జంట వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాహానికి వంగవీటి అభిమానులతో పాటు వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో విజయవాడ-నిడమానూరు పోరంకి రోడ్డులోని మురళి రిసార్ట్స్ లో ఈ పెళ్లి వేడుకకు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తో వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాతి కాలంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీచేయగా.. ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.