టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా టీడీపీ విరాళాల వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీకి విరాళాలు ఇవ్వాలని శ్రేణులను, సానుభూతిపరులను కోరారు. 10 రూపాయల నుంచి ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు. వైసీపీ గ్యాంబ్లర్ల నుంచి కూడా విరాళాలు సేకరించిందని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు. ఆ విధంగా విరాళాలు సేకరించి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు అనుమతించాలని చూశారని ఆరోపించారు. ఎన్ఆర్ఐల నుంచి నిబంధనల మేరకే విరాళాలు సేకరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐలు రాష్ట్రానికి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పని చేయాలని సూచించారు. జగన్ మోహన్ రెడ్డి తప్ప ఏపీలో ఎవరూ బాగుపడలేదని, రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోయిందన్నారు . దేశం అభివృద్ధి దిశలో వెళుతుంటే, ఏపీ మాత్రం అంతకంతకూదిగజారేలా జగన్ చేశారని చంద్రబాబు విమర్శించారు. జనంలో ఇప్పటివరకు చూడని అసహనం , ఎవరికీ అర్థం కాని భయం, ఆందోళన కనిపిస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోలార్ పవర్ అందుబాటులోకి వచ్చినా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండటం విడ్డూరమని బాబు అన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన వైసీపీకి ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకూడదని చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి జెండాలు ప్రతి ఇంటిపై ఎగురవేయాలని, కూటమిని ముందుండి నడిపించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.