ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఫలితం కోసమే అందరి ఎదురు చూపులు. అయితే ఈసారి ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఆ వ్యతిరేకతకు నిదర్శనమే ఈసారి ఏపీలో ఓటింగ్ శాతం పెరగటం. ఎక్కడెక్కడో ఉన్న యువత కూడా తమ సొంత గ్రామాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే గతంలో ఎప్పుడు లేంతంతగా ఈసారి ఏపీ ఎన్నికల్లో అల్లర్లు చెలరేగాయి. ఎలక్షన్ రోజే కాకుండా మరుసటి రోజు ఇప్పటికీ కూడా దాడులు జరుగుతున్నాయి. ఇదంతా ఓటమి భయంతోనే వైసీపీ ముక్కలు చేస్తున్న అరాచకపర్వం. దీని పై తాజాగా జనసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగబాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అధికార‌ వైసీపీకి ప‌రాజ‌యం తప్పదన్న అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారన్నారు. ఈ అంశం పై నాగబాబు బుధ‌వారం పార్టీ అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాలో ఓ లేఖ విడుద‌ల చేశారు. ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో నెలకొన్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల‌ను నాగ‌బాబు లేఖ‌లో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని నాగబాబు ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందన్నారు. పోలింగ్ అనంతరం ఏపీలో నెలకొన్న హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా వైసీపీ శ్రేణులు దాడుల‌కు పాల్ప‌డ‌డం విచార‌క‌రమని నాగబాబు అన్నారు. వైసీపీ డీఎన్ఏలోనే హింస ఉందని, పులివ‌ర్తి నానిపై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌టం వైసీపీ హింస‌కు పరాకాష్ఠ అని నాగ‌బాబు మండిప‌డ్డారు. ఇలా ప‌లువురు నేత‌ల‌పై దాడుల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఇక‌ జూన్ 4న ఎన్నికల ఫలితాలతో వచ్చే ప్రజాతీర్పుతో వైసీపీ మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఆ రోజున పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాల‌ని తెలిపారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే ఇందుకు నిదర్శనమని నాగబాబు చెప్పుకొచ్చారు.