ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారి నెల రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల డిస్‌క్వాలిఫికేషన్ తప్పదన్నారు.

తాము అసెంబ్లీకి వెళ్లి పిటిషన్ ఇద్దామంటే సెక్రటరీ బాత్రూంలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తాము ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదన్నారు. వారి ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం ఉంటే వెంటనే రాజీనామా చేసి… మళ్లీ గెలుపొందాలని సవాల్ చేశారు.