ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన నేత నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేయాలని ఆశించన ఆయనకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. తమ పార్టీ తరపున శ్రీనివాసవర్మను లోక్ సభ ఎన్నికల బరిలోకి దించింది. అయినప్పటికీ రఘురాజు తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందనే భావిస్తూ వచ్చారు. తాజాగా ఈ అంశంపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. తాము ప్రకటించిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ మాట్లాడుతూ… లోక్ సభ అభ్యర్థిగా శ్రీనివాసవర్మ బరిలో ఉంటారని తెలిపారు. దీంతో, రఘురాజుకు నరసాపురం అవకాశాలు మూసుకుపోయాయి.