స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బెయిల్ తీర్పు ప్రతులలోని ముఖ్యాంశాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తీర్పు కాపీలోని కీలక అంశాలను హైలైట్ చేసి, వాటిని ఎక్స్ లో షేర్ చేశారు.  ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ… స‌త్యం గెలిచిందని, అస‌త్యంపై యుద్ధం ఆరంభమైందని సమరశంఖం పూరించారు. మ‌న నాయ‌కుడు చంద్ర‌బాబు క‌డిగిన ముత్య‌మే అని అభివర్ణించారు. “స‌త్య‌మేవ‌జ‌య‌తే అని మ‌రోసారి నిరూపిత‌మైంది. ఆల‌స్య‌మైనా స‌త్య‌మే గెలిచింది. జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోని వ్య‌వ‌స్థ‌ల మేనేజ్ మెంటుపై స‌త్యం గెలిచింది. చంద్ర‌బాబు గారి నీతి, నిజాయతీ, వ్య‌క్తిత్వం మ‌రోసారి స‌మున్న‌తంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డింది. నేను త‌ప్పు చేయ‌ను, త‌ప్పు చేయ‌నివ్వ‌ను అని బాబు గారు ఎప్పుడూ చెప్పేదే మ‌రోసారి నిజ‌మైంది.