చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓ వ్యక్తి చెప్పు చూపించి షాకిచ్చారు. ఈ సంఘటన బోయినపల్లిలో చోటు చేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిశంకర్ సోమవారం కరీంనగర్ జిల్లా బోయినపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆయనకు చెప్పు చూపించాడు. ఆయనను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. తనకు చెప్పు చూపించడంతో రవిశంకర్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో తనకు ప్రాణహాని ఉందన్నారు. కాంగ్రెస్ గూండాల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ సమయంలో పోలీసుల తీరు తనను బాధించిందన్నారు. తనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వీడియోలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు నీలోజిపల్లి గ్రామంలో తనపై దాడికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాపాడినట్లు చెప్పారు. ఇలా దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న చొప్పదండిని గూండాల చేతుల్లోకి తీసుకెళ్తున్నారన్నారు.