ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పి మోసం చేసేవారిని నమ్మవద్దని, ఐదున్నర దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లోని సోమారం, ఎల్లంపేట, సైదోనిగడ్డ తండా, రావల్‌కోల్ గ్రామాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందన్నారు. మాయమాటలు చెబితే ఆగం కావొద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు. పదేళ్లలో తెలంగాణలో ఊహించని అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల వారు మన వద్ద జరిగిన అభివృద్ధిని చూసి నేర్చుకునే విధంగా కేసీఆర్ పని చేశారన్నారు.

తండాలను, పల్లెలను సీఎం కేసీఆర్ పంచాయతీలుగా మార్చారని, దీంతో అవి అభివృద్ధి పథంలో సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లకు పైగా పాలించి ప్రజలను వంచించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే, మరో అయిదేళ్లు ప్రజలకు సేవ చేస్తానన్నారు. తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు.