దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిత్రాన్ని విడుదల చేయకుండా నిర్మాతలను ఆదేశించాలని తన పిటిషన్ లో కారు. అంతేకాదు, వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, రామదూత క్రియేషన్స్, సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీలను లోకేశ్ తన పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పటివరకు నీతినిజాయతీతో కొనసాగారని, ఈ చిత్రం ద్వారా ఆయనను అపఖ్యాతి పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేశ్ వివరించారు. 

తమ రాజకీయ ప్రత్యర్థి జగన్ కు మేలు చేసేలా ఈ చిత్రం ఉందని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే ఇష్టమని… చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటే తనకు నచ్చదని రామ్ గోపాల్ వర్మ చెప్పారని లోకేశ్ తన పిటిషన్ లో స్పష్టం చేశారు. తనకు నచ్చిన విధంగా ఈ సినిమాలో పాత్రలను నిర్ణయించారని, ట్రైలర్ చూపినట్టే సినిమా అంతే ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు.