తెలంగాణలో ఎదగాలన్న ఆరాటమే తప్ప బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజల సంక్షేమంపై పట్టింపులేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యుర్థులే లేరని అన్నారు. డిక్లరేషన్ల పేరుతో అధికారం కోసం హడావుడి చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితులను మరోమారు మోసం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. అలాంటి పార్టీ తను అధికారంలో ఉన్నపుడు దళితులకు ఏంచేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు హైదరాబాద్ కు వచ్చి ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమేమో చేస్తానని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలను ఏండ్లపాటు పేదరికంలో ఉంచిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని మండిపడ్డారు. ఎస్సీ డిక్లరేషన్ పేరుతో రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.ఓవైపు మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తూ.. మరోవైపు రైతుల కోసం మీటింగ్ పెట్టడం బీజేపీ నేతలకే చెల్లిందని కవిత విమర్శించారు. అమిత్ షా సభ.. హంతకుడే హతుడికి సంతాపం తెలిపినట్లుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి మోదీ ప్రభుత్వం కేంద్రంలో అమలులోకి తీసుకొచ్చిందన్నారు. అది కూడా సరిగా అమలు చేయలేకపోతోందని, తొలుత 13 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు 2.5 కోట్ల మంది అన్నదాతలకే ఇస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.