వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని… ఈ మాట నేను పక్కాగా చెబుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రధానిని ప్రశంసించడం ద్వారా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో… సన్నాసి అంటున్నట్లుగా ఉందన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటున్నారని… మరి ఆ బడే భాయ్… ఈ ఛోటే‌ భాయ్‌కి ఏమిచ్చాడో… చెవిలో ఏం చెప్పాడో తనకు తెలియదు కానీ నిన్నటి ఆదిలాబాద్ సభతో తెలంగాణలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు, కాంగ్రెస్ భవిష్యత్తు కనిపిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్లు… అసోంలో జరిగినట్లు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.ఆయన ఒక ఏక్‌నాథ్ షిండే… మరో హిమంత బిశ్వ శర్మ… ఇక్కడ పుట్టి… కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెడతారన్నారు. తాను ఈ మాటను ఆషామాషీగా చెప్పడం లేదన్నారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బడేభాయ్ అని ఒక్క మాట మాత్రమే అనలేదని… భవిష్యత్తులో మీ ఆశీర్వాదం మాపై ఉండాలని చెప్పడం ఏమిటన్నారు.