నిరుపేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం అమలు విషయంలో జరుగుతున్న పొరపాటుల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు లేఖ రాశారు. ఈ ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని హ‌రీశ్ రావు ఈ సంద‌ర్భంగా సీఏం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్ ఇస్తున్నారు. కానీ, ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే, మొత్తం 201 యూనిట్లకు బిల్ వసూలు చేస్తున్నారని ఆయ‌న తెలిపారు. ఈ విధానం వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని గుర్తు చేశారు. అలాగే వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి దాపురించింద‌న్నారు. కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఒక‌వేళ 200 యూనిట్లు దాటితే.. 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి, మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని హ‌రీశ్ రావు సూచించారు. అంతేగాక రాష్ట్ర‌వ్యాప్తంగా 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులుంటే.. ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తుంద‌ని తెలిపారు. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు.