ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని, కానీ కేసీఆర్ సింహం అని, సింగిల్‌గానే వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. పందులు గుంపులుగా వస్తాయన్నారు. సోమవారం వేములవాడలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇప్పుడు జరుగుతున్న పోరాటం వ్యక్తుల మధ్య కాదని, బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడకు వచ్చి మన నెత్తిన పాలు పోశారన్నారు. ఎందుకంటే అక్కడ ఐదు గంటల విద్యుత్ అని చెప్పాడని, కానీ మనం ఇక్కడ 24 గంటలు ఇస్తున్నామని చెప్పారు. ఐదు గంటల విద్యుత్ అని ఆయన చెప్పినందుకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు వారిని మళ్లీ ప్రచారానికి పిలవడం లేదన్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయన్నారు. ఎవరు గెలుస్తారో డిసెంబర్ 3వ తేదీన చూద్దామన్నారు. ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లతో ఏమీ కాదన్నారు.