గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో నామినేషన్ ఉపసంహరించుకోవాలని నామినేషన్ దాఖలు చేసిన పలువురిని పోలీసుల ద్వారా బెదిరించారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. పలుచోట్ల నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఇతర పార్టీల నేతలను, స్వతంత్ర అభ్యర్థులను బెదిరిస్తున్నారన్నారు. గజ్వేల్‌లో 114 మంది ధరణి బాధితులు, కామారెడ్డిలో 58 మంది బాధితులు నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. కానీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.