ఎన్నికలు ముగిసాగాయి .. అయినా అక్కడ దాడులు ఆగడం లేదు .. దీంతో రంగంలోకి దిగిన ఈడీ 144 సెక్షన్ విధించింది . వివరాల్లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడు కూడా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి .. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయాలంటూ ఆదేశాలు ఇస్తూ పోలీసు శాఖకు జిల్లా కలెక్టర్ శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు . ఈ సెక్షన్ అమల్లో ఉన్నంతకాలం ముగ్గురు వ్యక్తులకు మించి గుంపులుగా ఉండకూడదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. అనుమానాస్పదంగా సంచరించడానికి కూడా వీల్లేదని అధికారులు పేర్కొన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలు మరుసటి రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. దీంతో 144 సెక్షన్‌ విధింపునకు ఈసీ నిర్ణయం తీసుకుంది. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.కాగా పల్నాడులో జరిగిన ఘర్షణలను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర డిజిపి దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా అదనపు బలగాలు పల్నాడుకు పంపినట్టు తెలిపారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు, ఘర్షణకు అవకాశం ఉన్న గ్రామాలకు తక్షణం కేంద్ర బలగాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.