హైదరాబాద్: కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చిందని రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్ స్లోగన్‌తోనే ఇన్నాళ్లు బీఆర్ఎస్‌లో ఉన్నానని చెప్పారు. శుక్రవారం నాడు తన నివాసంలో కేశవరావు మీడియాతో మాట్లాడుతూ… 85 ఏళ్లున్న తాను 55 ఏళ్లు కాంగ్రెస్‌లో పని చేశానని అన్నారు. సీడబ్య్లూసీ మెంబర్‌గా, నాలుగు రాష్ట్రాల ఇన్‌చార్జిగా కాంగ్రెస్ తనకు చాలా ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కొంత ఆలస్యం చేయడం వల్ల ఆ పార్టీతో తనకు కొంత తేడా వచ్చిందని కేశవరావు చెప్పారు.తెలంగాణ గురించి కేసీఆర్ ఆలోచించక ముందే తాము ఆలోచించామని అన్నారు. తన కొడుకు విప్లవ కుమార్ కోరిక మేరకు ఆనాడు టీఆర్ఎస్‌లో చేరినట్లు చెప్పారు. చాలా బాధతో తాను ఆనాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని అన్నారు. పాటలు, ధర్నాల వల్లనో తెలంగాణ రాలేదన్నారు. పార్లమెంట్‌లో ఫైట్ చేయడం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కారణం తెలుసుకోని.. పార్టీని సరి చేసుకోవాలని చెప్పారు. ఆయన కుటుంబం పార్టీని నడుపుతుందన్న మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని దెబ్బతీసిందని చెప్పారు. యువకులను ముందు పెట్టీ బీఆర్ఎస్(BRS) పార్టీని నడిపించాలని చెప్పారు. 13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత తాను తిరిగి సొంత ఇంటికి చేరుకునే సమయం వచ్చిందని వివరించారు. తన కూతురు రేపు(శనివారం) కాంగ్రెస్‌లో చేరుతున్నారని కేశవరావు ప్రకటించారు.రాజకీయ అవకాశవాదంతో తాను పార్టీ మారట్లేదన్నారు. తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ ఆ నాడు చెప్పారని.. కానీ మాటమీద ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు. విలీనం చేయకపోవడం కూడా పార్టీ మారాలన్న నిర్ణయానికి ఓ కారణమని చెప్పారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. కేసీఆర్‌ను కూడా ఇండియా కూటమిలో చేరమని సలహా ఇచ్చానని అన్నారు. బీఆర్ఎస్ విషయంలో తాను తప్పు చేస్తే మన్నించాలని కోరారు. తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని.. మళ్లీ ఎన్నికలోచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేయమంటే చేస్తానని కేశవరావు తెలిపారు..