యువతా ఈ దేశం మీది.. ఈ రాష్ట్రం మీది.. భవిష్యత్ మీది… ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఏకైక ఆయుధం ఓటు… ఆలోచించి ఓటెయ్యండి… అభివృద్ధికి అండగా నిలబడండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ యువతకు పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును అందరూ గమనించాలన్నారు. 1956లో తెలంగాణ కాంగ్రెస్ చిన్న పొరపాటు కారణంగా 56 ఏళ్ల పాటు తెలంగాణ ఏడ్చిందన్నారు. కరెంటు లేదు… మంచినీళ్లు లేవు… ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. ఉద్యోగాలు లేవు… నిధులు రాలేదన్నారు. మళ్లీ 2001లో ఉద్యమం మొదలైందని, అప్పుడు కూడా కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందన్నారు. తెలంగాణ ఇస్తామని నమ్మబలికి 2004లో మనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారని, కానీ వారు మనిషికిన్ని మంత్రి పదవులు పంచుకుని అధికార దాహం తీర్చుకున్నారన్నారు. కానీ తెలంగాణను వదిలి పెట్టారన్నారు. కానీ మనం మాత్రం తెలంగాణను వదల్లేదన్నారు. కొట్టాడుకుంటూ కొట్లాడుకుంటూ పోయాం.. 14 ఏళ్లు గడిచిన తర్వాత తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడే ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు తెలంగాణ కోసం దిగివచ్చారన్నారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయలేదన్నారు. రాజీనామా చేయమంటే లాగులు తడిశాయన్నారు.