టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ లభించింది. ఇవాళ ఏపీ హైకోర్టు చంద్రబాబుకు 5 షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు.  “ఇవాళ చంద్రబాబుకు బెయిల్ వచ్చిందంటే ఆయనొక్కరే ఈ పోరాటంలో గెలిచారని కాదు, ఆయన కుటుంబం గెలిచిందని కాదు… ఈ పోరాటంలో ప్రజలు గెలిచారు, మహిళా శక్తి గెలిచింది. వాళ్లందరికీ నా తరఫున, మా కుటుంబం తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.  నారా భువనేశ్వరి రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వెళ్లి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె తన స్పందన తెలియజేశారు.