జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్నీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. శుక్రవారం మనోహర్‌ మీడియాతో మాట్లాడారు. ‘తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు. ఈ రోజు నుండి ఏప్రి ల్‌ 12 వరకూ పవన్ ప్రచార పర్యటనలు కొనసాగనున్నాయి. ఏప్రిల్‌ 2 వరకూ ఆయన పిఠాపురంలో ఉంటారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు పవన్‌ పిఠాపురం చేరుకుంటారు. తొలిరోజు శక్తి పీఠం పురుహుతికాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. దత్త పీఠాన్ని దర్శిస్తారు. దొంతమూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలులో వారాహి విజయభేరి సభలో పాల్గొంటారు. ఏప్రిల్‌ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. పిఠాపురంలో ఉగాది రోజైన 9వ తేదీన నిర్వహించే ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు. ఆ తర్వాత 10న రాజోలు, 11వ తేదీ పీ. గన్నవరం, 12వ తేదీ రాజానగరం లోని బహిరంగ సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ’ అని మనోహర్‌ తెలిపారు.