టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఇవాళ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ను కూర్మన్న పాలెం వద్ద విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్యవేదిక సంఘం ప్రతినిధులు కలిశారు. ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

వినతి పత్రంలోని ముఖ్యాంశాలు

• స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చిన 8,500 మంది నిర్వాసితుల సమస్యలు 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి.
• స్టీల్ ప్లాంట్ కోసం 26 వేల ఎకరాలు తీసుకుని పెదగంట్యాడ, గంగవరం, వడ్లపూడి,     అగనంపూడి పంచాయతీల్లోని 64 గ్రామాలను ఖాళీ చేయించారు.
• భూ యజమానులకు ఎకరాకు రూ.1,250 మాత్రమే అప్పట్లో పరిహారం ఇచ్చారు. చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
• కొన్ని పోరాటాల ద్వారా 5 వేల మంది నిర్వాసితులకు ప్లాంట్ లో ఉద్యోగాలు వచ్చాయి.
• 8 వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చారు… మరో 8,500మందికి ఇవ్వలేదు.
• కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంటును 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని చెబుతోంది. ఇదే జరిగితే నిర్వాసితులు ఘోరంగా నష్టపోతారు.
• మీరు అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థలా కొనసాగించాలి.
• ప్రధాని వద్దకు నిర్వాసితులను తీసుకెళ్లి మా సమస్యల్ని పరిష్కరించాలి.
• మిగిలిపోయిన ఆర్ కార్డుదారులకు ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలి.
• స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ను నమ్ముకుని ఉన్న కాంట్రాక్టు కార్మికులకు పని భద్రత కల్పించాలి… అని విజ్ఞప్తి చేశారు.