హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నేడు ఆయన కాసేపు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆరే ఒప్పుకున్నారన్నారు. ఇద్దరి ముగ్గురి ట్యాపింగ్‌పై వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేసు ప్రూవ్ అయితే కేటీఆర్‌కు పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. సినిమా వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేశారని తెలిసిందన్నారు. కాశీం రజ్వీ కంటే గొప్పోల్లు కేసీఆర్ వద్ద ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లని కోమటిరెడ్డి అన్నారు.త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్ జరుగుతాయని కోమటిరెడ్డి తెలిపారు. ఇష్టం వచ్చినట్లు సినిమా హాల్లో రేట్లు పెంచి వసూలు చేస్తున్నారన్నారు. మా డిపార్ట్మెంట్ టీంలు సినిమా హళ్లపై నిఘా ఉంచాయన్నారు. తేడా వస్తే థియేటర్లను సీజ్ చేస్తామన్నారు. సినిమా ప్రమోషన్లకు, క్లాపింగ్‌లకు తాను రానని ఇండ్రస్టీలో ఉన్న వారికీ చెప్పానన్నారు. ఎక్కువ బడ్జెట్ పేరుతో సినిమాలు తీసి టికెట్ రేట్లు పెంచాలి అంటే కష్టమన్నారు. దీని వల్ల చిన్న సినిమాను నమ్ముకున్న వాళ్లకు తీరని నష్టం జరుగుతోందన్నారు. సినిమా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనకు ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదులూ రాలేదన్నారు. తనకు ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆలోచన చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.ఇక పనిలో పనిగా.. ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంపై కూడా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా ఎంపీకి పోటీ కష్టమేనని భావిస్తున్నట్టు తెలిపారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి… ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ అంటే లీగల్ సమస్యలు వస్తాయని అభిప్రాయపడుతున్నట్టు పేర్కొన్నారు. కొత్త వాళ్ళకు టికెట్ ఇవ్వడం అంటే గెలిచే వాళ్లకు ఇస్తున్నారని తెలిపారు. అలాగని అది పాత వాళ్లకు అన్యాయం కాదన్నారు. వారికి తామంతా ఉన్నామన్నారు. హైదరాబాద్ లాంటి వీక్ ఉన్న స్థానాల్లో గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు..