సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. ‘సంకల్ప పత్ర’ పేరుతో ఆదివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కలిసి మేనిఫెస్టోను ప్రకటించారు.14 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల ప్రకటించింది. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా సంకల్ప్‌ పత్ర రూపొందించామని చెప్పారు. విశ్వబంధు, సురక్షిత భారత్‌, సమృద్ధ భారత్‌, గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వచ్ఛ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్‌ లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించామని బీజేపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నాలుగు స్తంభాలతో సంకల్ప్ పత్రకు పునాదులు వేశామని, యువశక్తి, నారీశక్తి, గరీబ్‌, కిసాన్‌ను దృష్టిలో ఉంచుకునే సంకల్ప్ పత్ర తయారు చేశామని తెలిపారు. దేశ యువత ఆకాంక్షలను తమ సంకల్ప్ పత్ర ప్రతిబింబిస్తుందని,ఈ పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మోడీ పేర్కొన్నారు. . బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి నాడు సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు. సంకల్ప్ పత్ర తయారు చేసిన రాజ్‌నాథ్‌ బృందానికి, సూచనలు ఇచ్చిన లక్షల మందికి ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు. భవిష్యతులో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగవచ్చని, యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తామని చెప్పారు. చిరువ్యాపారులకు మరిన్ని రుణాలు కల్పిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.