జనసేనాని పవన్ కల్యాణ్ తెనాలిలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు.తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ లకు మద్దతుగా పవన్ మాట్లాడాడారు. అలాగే సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజల పాస్ పుస్తకాలపై, పొలాల్లో హద్దు రాళ్లపై కూడా చెదరని చిరునవ్వుతో జగన్ ఫొటోలు కనిపిస్తున్నాయని విమర్శించారు.జగన్ రాష్ట్రం తన సొత్తు అనుకుంటున్నాడని ,కానీ తను కిందపడే రోజు దగ్గర్లోనే ఉందంటూ హెచ్చరించారు. అహంకారం తలకెక్కిన జగన్ మనమందరం తనకు బానిసలమనుకుంటున్నాడని పవన్ మండిపడ్డాడు . 30 ఏళ్లుగా ఈజిప్టులో నిరంకుశంగా వ్యవహరించినందుకు హోస్నీ ముబారక్ అనే నేత పై ఓ టైలర్ తిరుగుబాటు మిగతా ప్రజలను చైతన్యవంతులను చేసి హోస్నీ ముబారక్ అంతు చూసిందని వివరించారు. శ్రీలంకలో కూడా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు దేశాధ్యక్షుడి భవనంలోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టారని… రేపు తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఇలాగే ప్రజలు వచ్చి కూర్చుంటారని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని జగన్ మద్యం షాపుల వద్ద కాపలా పెట్టించాడని, సమస్యల పరిష్కారం గురించి అడిగిన అంగన్వాడీలను కొట్టించాడని ఆరోపించారు. చిన్నప్పుడు శివశివానీ స్కూల్లో పరీక్ష పేపర్లు కొట్టేసిన వ్యక్తి జగన్ అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. తాను ఇవాళ ఇంత జ్ఞానం సంపాదించడానికి నా చిన్ననాటి వైశ్య మిత్రుడు అందించిన పుస్తకాలే కారణమని, వైశ్య సోదరులపై దాడులు జరగకుండా, వ్యాపారాలు సాఫీగా జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు . అసలైన పాలన ఎలా ఉంటుందో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ద్వారా చేసి చూపిస్తానని ఆయన అన్నారు . ఇక్కడి రైతుల సంక్షేమం కోసం పాటుపడతానని, చెక్ డ్యాముల నిర్మాణం చేపడతానని, చట్టసభలో సమస్యలపై చర్చ జరిగేలా చూస్తానని , అసెంబ్లీలో బూతులు తిట్టే సంప్రదాయాన్ని అడ్డుకుంటానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు . .