Home Andhra Pradesh పవన్ దెబ్బకు బీజేపీ దిగొచ్చిందా?

పవన్ దెబ్బకు బీజేపీ దిగొచ్చిందా?

janasena tdp alliance
janasena tdp alliance

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో నాలుగేళ్లుగా స్నేహం కొనసాగిస్తున్న బీజేపీ ఉన్నట్లుండి ఉరిమింది. తాజాగా ఏపీ టూర్ కు వచ్చిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఎలాంటి సంకేతాలు లేకుండా వైసీపీపై బీజేపీ మొదలుపెట్టిన దాడి వెనుక ఆ పార్టీలో ఉన్న మాజీ టీడీపీ నేతలే కారణమంటూ అధికార పార్టీ మండిపడుతోంది. మరోవైపు బీజేపీ నేతల విమర్శల వెనుక అసలు కారణం పవన్ కళ్యాణే అన్న చర్చ జరుగుతోంది.దాదాపు నాలుగేళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తమకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని భావిస్తున్న పవన్ కళ్యాణ్ 2014 ఫార్ములాను తిరిగి తెరపైకి తెస్తే తప్ప ఉనికి కాపాడుకోవడం కష్టమని భావించారు. దీంతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగట్టాలని గతేడాదే నిర్ణయించారు.

అప్పటి నుంచి బీజేపీకి దీనిపై రూట్ మ్యాప్ ఇవ్వాలని అడగటం మొదలుపెట్టారు. కానీ అప్పటికే కేంద్రంలో వైసీపీ సాయం తీసుకుంటున్న బీజేపీ దీనిపై మౌనం వహించింది. దీంతో రూట్ మ్యాప్ ఇవ్వకపోతే తన దారి చూసుకుంటానని కూడా పవన్ హెచ్చరికలు జారీ చేశారు.అయినా బీజేపీ లొంగలేదు.దీంతో అప్పటివరకూ బీజేపీ పట్టించుకోని చంద్రబాబుతో వరుసగా భేటీలు మొదలుపెట్టేశారు.ఈ నేపథ్యంలో పరిస్ధితి చక్కదిద్దేందుకు ప్రధాని మోడీ వైజాగ్ టూర్ కు వచ్చినప్పుడు పవన్ ను పిలిపించి మాట్లాడారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందామంటూ నచ్చజెప్పారు.ఆ తర్వాత కూడా బీజేపీ నుంచి స్పందన లేదు.దీంతో పవన్ చంద్రబాబుతో భేటీలు కొనసాగించడమే కాకుండా బీజేపీకి గుడ్ బై చెప్పేస్తానని కూడా ఆ పార్టీ నేతలకు ఢిల్లీలో తేల్చిచెప్పేశారు.దీంతో బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పలేదు.

చివరికి పవన్ కోరుకుంటున్నట్లుగానే ఎన్నికలకు 9 నెలల ముందు వైసీపీపై బీజేపీ పోరు మొదలైపోయింది.ఇందులో భాగంగానే అమిత్ షా, జేపీ నడ్డా ఏపీకి వచ్చి మరీ వైసీపీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ నుంచి ఎలాంటి కవ్వింపులు లేకపోయినా అమిత్ షా, నడ్డా చేసిన విమర్శలతో అధికార పార్టీకి పరిస్ధితి అర్ధమైంది. దీంతో వైసీపీ నేతలు కూడా కౌంటర్లు మొదలుపెట్టారు. అలా చేయకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళనలో కనిపిస్తున్నారు. అంతిమంగా వైసీపీ వర్సెస్ విపక్షాలుగా పరిస్ధితిని మార్చాలన్న పవన్ కోరిక నెరవేరినట్లయింది.