ఎన్నికలకు రెడీ అవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల రాజకీయంగా వరుస పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ నుంచి వలసలు ఇప్పటికే ప్రారంభం కాగా, ముఖ్యనేతలందరూ సమావేశాలతో తీరికలేకుండా గడుపుతున్నారు. తాజాగా, మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని, అందులో భాగంగా జనసేనలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఆయన పవన్‌ కళ్యాణ్ ను కలవబోతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ, కాపు జేఏసీ నేతలు ఆయనతో సమాలోచనలు జరిపారు. అయితే, తాము ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశామని నేతలు తెలిపారు. మరోవైపు, మరో రెండుమూడు రోజుల్లో జనసేన ముఖ్యనేతలు ముద్రగడను కలిసే అవకాశం ఉందని సమాచారం. జనసేన నేతలు తనను కలవడంపై ముద్రగడ పెదవి విప్పడం లేదు. అంతేకాదు, ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంలోనూ కుటుంబ సభ్యులు మౌనం పాటిస్తున్నారు.