ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ పార్టీకి అనుకూలంగా పనిచేసే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాలుపంచుకోవడం సరికాదన్నారు. అతి తక్కువ జీతాలతో ఒక పార్టీ తాత్కాలికంగా నియమించి, వాళ్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించుకున్నట్లయితే అది పక్షపాతాలకు దారితీస్తుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల విధుల్లో వాడుకుంటే అపోహలకు ఆస్కారం తగ్గుతుందని జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. 

అలా కాకుండా వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగిస్తే.. వారు నిజంగా మంచి చేసినా చెడుగానే వుంటుందన్నారు. ఇది ప్రభుత్వానికి, ఉద్యోగులకు మంచిది కాదని జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. పోలింగ్ బూత్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో ఓటు ప్రాముఖ్యత తెలియజేయడం, దొంగ ఓట్లను అడ్డుకోవడంలో భాగంగా ‘‘ ఓట్ ఇండియా – సేవ్ డెమొక్రసీ’’ పేరుతో లోక్‌సత్తా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.