ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారని తెలిసి ఆవేదన చెందినట్లు హీరో, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈమేరకు జనసేన తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. ఆపై ఈ ప్రకటనను ట్వీట్ చేస్తూ చంద్రమోహన్ ఆత్మకు శాంతిని ప్రసాదించమని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చంద్రమోహన్ తమ కుటుంబ స్నేహితుడని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవితో కలిసి చంటబ్బాయ్, ఇంటిగుట్టు లాంటి సినిమాల్లో నటించారని గుర్తుచేశారు. తన తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ తో పాటు ‘తమ్ముడు’ సినిమాలో కలిసి నటించినట్లు తెలిపారు. తెరపై చంద్రమోహన్ ను చూడగానే ఎంతగానో పరిచయం ఉన్న వ్యక్తిగా, దగ్గరి బంధువును చూసినట్లుగా అనిపిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన తనదైన నటనను చూపించారని తెలిపారు. ఎన్నో పాత్రలలో ఆయన ఒదిగిపోయారని, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యంలో నానావలిగా ఎన్నటికీ గుర్తుండిపోతారని పవన్ కల్యాణ్ చెప్పారు. సుమారు 900 లకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికీ చేరువయ్యారని, చంద్రమోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

Previous articleచంద్రమోహన్ మృతి… న్యూజిలాండ్ నుంచి మోహన్ బాబు భావోద్వేగ స్పందన
Next articleకాంగ్రెస్ ఐదు నెలల్లోనే కర్ణాటకను భ్రష్టు పట్టించింది…